దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఒకే రకమైన న్యాయం చేయాలని భూ నిర్వా సిత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని లింగారెడ్డిపల్లిలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత నియోజకవర్గంలో లగచర్ల ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.23 లక్షలు, ఒక ప్లాటు అందించారన్నారు. పేట– కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మాత్రం రూ. 20 లక్షలు మాత్రమే అందజేశారని వాపోయారు. సొంత నియోజకవర్గంలో ఒక న్యాయం, పేట నియోజకవర్గంలో మరొక న్యాయం చేయడం సరికాదన్నారు. అభివృద్ధికి సహకరిస్తూ తమ తరతరాల జీవనాధారమైన భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గోపాల్‌రావు, సర్పంచ్ మొగులప్ప, నారాయణ, జగపతిరెడ్డి, రాజు, రైతులు పాల్గొన్నారు.


