నారాయణపేట: కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేధికని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న మూడో జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కల్పించి రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి అధికసంఖ్యలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 5,300 కేసులను పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా 18వ ర్యాంకు సాధించిందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, న్యాయశాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, ఎగ్జిక్యూషనన్ పిటిషన్లు (ఈపీ), సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు (ఎన్‌న్‌బీడబ్ల్యూ) ఉన్న కేసులు అధికసంఖ్యలో పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల పరిష్కార ప్రక్రియను కూడా యథావిథిగా కొనసాగించాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింద్యానాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయిమనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, డీఈఈ రాములు, శ్రీనివాసులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


