నారాయణపేట: ప్రజలకు పారదర్శక, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో సేవలు అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యతని ఎస్పీ డా. వినీత్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం నారాయణపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రహరీ చుట్టూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. స్టేషన్‌లోని రికార్డులు, మాల్ఖానా, ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తితో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారులకు తగిన విధంగా స్పందిస్తూ ఫిర్యాదులను తప్పనిసరిగా ఆన్‌లైన్ చేయడంతో పాటు రసీదు ఇవ్వాలని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ పరిశీలించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో కనీసం నాలుగు కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్, కమ్యూనిటీ పోలీసింగ్, పెట్రోలింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం స్టేషన్‌్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. ఆయన వెంట డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, సీఐ శివశంకర్, ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, విజయభాస్కర్, మన్యం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


