మూడు ముక్కలాట..! | - | Sakshi
Sakshi News home page

మూడు ముక్కలాట..!

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

నారాయణపేట: జిల్లాలోని కోస్గి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతున్నా.. సంబంధిత అధికారుల నిఘా కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోస్గిలోని పలు ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు పోటాపోటీగా ఏర్పడి.. జూదగాళ్లకు ఏసీ గదులు, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ దందా సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల్లో కూడా ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసి రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్ర శివారు ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లు, ఫాంహౌస్‌లు, పొలాలు, గుట్టల వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకొని పేకాట దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

చేతులు మారుతున్న రూ.లక్షలు..

పేకాట కేంద్రాల్లో రోజు రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించుకొని ఆటగాళ్లను సమీకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు బానిసైన పలువురు అప్పులు చేసి మరీ ఆడుతున్నారని.. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరా యువ నాయకుడు..?

పోలీసులను మేనేజ్‌ చేసేందుకు కోస్గిలో ఓ యువ నాయకుడు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి కేంద్రం నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఆరోపణలపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మూడు ముక్కలు.. నాలుగు వాటాలుగా పేకాట గ్యాంగ్‌ వ్యవహరిస్తోన్నట్లు సమాచారం. పేకాట కేంద్రాలకు యువత పెద్దసంఖ్యలో ఆకర్షితులవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణమే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పేకాట కేంద్రాల నిర్వాహకులతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నాలుగేళ్లు.. 101 కేసులు..

జిల్లావ్యాప్తంగా పోలీసులు తరచూ దాడులు నిర్వహించి నాలుగేళ్లలో 101 కేసులు నమోదు చేయడంతో పాటు 581 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.14,81,421 నగదు, 330 మొబైల్స్‌, 226 బైక్స్‌, రెండు ఇతర వాహనాలు, కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయినా రహస్య ప్రాంతాల్లో నేటికీ పేకాట శిభిరాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది కేసుల నమోదు ఇలా..

మార్చి 23న నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో 11 మందిని అరెస్టు చేసి, రూ.1,22,900, 9 బైక్‌లు, 11 సెల్‌ఫోన్లు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఏప్రిల్‌ 9న నారాయణపేట మండలం బొమ్మన్‌పాడులో ఏడుగురిని పట్టుకొని వారి నుంచి రూ.4,330, 4 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏప్రిల్‌11న కోస్గి బస్టాండ్‌ సమీపంలో ఎన్‌.రాకేష్‌ నివాసంలో టాస్క్‌ఫోర్స్‌, కోస్గి పోలీసులు సంయుక్తంగా దాడిచేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1,89,800, 8 మొబైల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.

మే నెల 15న నర్వ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో టాస్క్‌ఫోర్స్‌, నర్వ పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడిచేసి రూ.1,13,200, 15 బైక్‌లు, 18 స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని 16 మందిపై గేమింగ్‌యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారు.

మే నెల 22న కోస్గి శివారులో పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకొని వారినుంచి 5 సెల్‌ఫోన్లు, రూ.29,180 స్వాధీనం చేసుకున్నారు.

జూలై 26న మరికల్‌లోని నంది లాడ్జ్‌, శెట్టి కాంప్లెక్స్‌ వద్ద ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.45,100, 7 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 8న మక్తల్‌ మండలం కల్లంగడ్డ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.9,630 నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నారాయణపేట, కోస్గిలో జోరుగా పేకాట దందా

జూదగాళ్లకు ఏసీ గదుల్లో సకల సౌకర్యాలు

పట్టణ, గ్రామీణ శివారుల్లో రహస్య స్థావరాలు

రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు

పోలీసుశాఖ సహకారంతోనేనన్న ప్రచారం?

నాలుగేళ్లలో 101 కేసులు.. రూ.14,81,421 స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement