‘పీఎంశ్రీ’లు.. సమగ్ర వికాసానికి వేధికలు | - | Sakshi
Sakshi News home page

‘పీఎంశ్రీ’లు.. సమగ్ర వికాసానికి వేధికలు

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

నారాయణపేట: పీఎంశ్రీ పాఠశాలలను కేవలం తరగతులకే పరిమితం చేయకుండా సమగ్ర వికాసానికి వేధికలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు బాలికల భద్రత, సైబర్‌ సేఫ్టీ, చట్ట విజ్ఞానం, ఆర్థిక అక్షరాస్యత, స్వీయ రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలల వారీగా చేపట్టిన ఉత్తమ కార్యక్రమాలు, వాటి ఫలితాలను ప్రతి నెల ప్రజెంటేషన్‌న రూపంలో సమర్పించాలని కోరారు. బాలికలకు వచ్చే వారంలో గుడ్‌, బ్యాడ్‌ టచ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవసరమైతే నిపుణులను పాఠశాలలకు ఆహ్వానించి ప్రదర్శనాత్మకంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అక్టోబర్‌, నవంబర్‌లో చట్ట విజ్ఞానం, సైబర్‌ సేఫ్టీ, స్వీయ రక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్‌, సైబర్‌వింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకొని ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా భద్రత, బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు పెంచేందుకు పిగ్గీ బ్యాంక్‌ చేపట్టాలని.. డబ్బు విలువ, పొదుపు, ఆర్థిక నిర్వహణపై ప్రాథమిక అవగాహన కల్పించాలని కోరారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలలకు వచ్చే గ్రాంట్లను పారదర్శకంగా, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. గ్రీనరీ, లైబ్రరీ, క్లబ్‌లు, ఆర్ట్‌అండ్‌క్రాఫ్ట్‌ తదితర కార్యక్రమాలకు నిధులను సద్వినియోగం చేయాలన్నారు. ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, హాజరు, రిజిస్టర్లు, సమావేశ వివరాలు, నివేదికలను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి సమీక్షలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలు, ఎదురైన సమస్యలు, పెండింగ్‌ అంశాలు, తదుపరి కార్యాచరణపై స్పష్టమైన ప్రజెంటేషన్‌ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్‌, గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా సమన్వయకర్త నాగమణిమాల, ఎంఈవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement