నర్వ: ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు. గురువారం మండలంలోని కుమార్‌లింగంపల్లి శివారులో రైతు గోపాల్‌రెడ్డి సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ తోటను ఉద్యాన అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుతో మాట్లాడి సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2022 నుంచి 8 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నానని.. సుమారు 40 టన్నుల దిగుబడి సాధించడంతో రూ.6.80 లక్షల ఆదాయం వచ్చిందని రైతు వివరించారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడించారు. ఆయిల్‌పామ్ సాగుతో పొందుతున్న లాభాలు, అనుభవాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని మంత్రి కోరారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, మక్తల్ ఉద్యాన అధికారి రామకృష్ణ, జిల్లా ఆయిల్‌ఫెడ్ మేనేజర్ రాధాకృష్ణ, విస్తరణ అధికారులు జనార్దన్, లింగరాజ్, ఫయాజ్, ఈశ్వర్ పాల్గొన్నారు.


