ఖాకీల్లో అవినీతి చిచ్చు! | - | Sakshi
Sakshi News home page

ఖాకీల్లో అవినీతి చిచ్చు!

Aug 18 2026 7:52 AM | Updated on Aug 18 2026 7:52 AM

తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఓ ఉన్నతాధికారిపై సీఐడీ విచారణ!

గద్వాలపై ప్రత్యేక దృష్టి

తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఓ ఉన్నతాధికారిపై సీఐడీ విచారణ!

రోజురోజుకు తెరపైకి వస్తున్న

కొత్త అంశాలు

భూముల వ్యవహారం నుంచి అక్రమ వసూళ్ల వరకు.. ఆరోపణలపై చర్చ

వాస్తవాలు తేలాలంటే

సమగ్ర విచారణే మార్గం

మహబూబ్‌నగర్‌ క్రైం/గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్‌ శాఖకు చెందిన కొందరు అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి పాలమూరులో కీలక హోదా లో పనిచేసిన ఓ ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం, వాటిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖ లోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైన ట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలను విచారణలో తేల్చాల్సి ఉంది. గతంలో ఉమ్మ డి జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేసిన సదరు ఉన్నతాధికారి జాతీయ రహదారికి సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు శాఖలో చర్చ జరుగుతోంది. దీనికి అదనంగా నవాబ్‌పేట మండల పరిధిలోని రెండు గ్రామాల శివారులో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవహారంలోనూ ఆయనతో పాటు గతంలో అక్కడ పనిచేసిన ఓ ఎస్‌ఐ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించిన లావాదేవీలను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన వాస్తవాలు అధికారిక రికార్డులు, విచారణ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది.

రాజకీయ అండ ఉందంటూ..

కొంతమంది అధికారులకు రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని కారణంగానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కొందరికి వరుసగా అనుకూల పోస్టింగులు లభిస్తున్నాయనే చర్చ శాఖలో ఉంది. మొత్తంగా సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు వెలువడుతున్న సమాచారంతో గద్వాల పోలీస్‌శాఖలో గతంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై మళ్లీ చర్చ మొదలైంది. భూముల లావాదేవీలు, అక్రమ వసూళ్లు, ఇసుక–మట్టి వ్యవహారాలు, పోస్టింగుల విషయంలో ఆరోపణలు.. ఇలా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిగితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తప్పు చేశారా? లేక ఆరోపణలు నిరాధారమా? అన్నది విచారణ పూర్తయ్యే వరకు తేలాల్సి ఉంది.

సీఐడీ విచారణ అంశం తెరపైకి రావడంతో గద్వాల జిల్లాలోనూ గతంలో జరిగిన పలు వ్యవహారాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఓ రేంజ్‌ స్థాయి అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ వేటు పడినట్లు ప్రచారం జరుగుతుండగా.. ఆయనకు మధ్యవర్తులుగా కొందరు డివిజన్‌ స్థాయి, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ స్థాయి అధికారులు వ్యవహరించేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్‌శాఖలో విధి నిర్వహణ, కేసుల దర్యాప్తు, నెలవారీ నేర నివేదికలు, సమీక్షలు తదితర అంశాలు అధికారుల పనితీరుకు ప్రామాణికాలుగా ఉంటాయి. అయితే కొందరు అధికారులకు పోస్టింగులు, ఇతర ప్రయోజనాల విషయంలో అనధికారిక లావాదేవీలు ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు తాజాగా తెరపైకి వచ్చాయి. నెలవారీ మామూళ్ల విషయంలోనూ ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వాటి వాస్తవాలను అధికారిక విచారణలో నిర్ధారించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement