నారాయణపేట: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర సమాచారం కీలకమని కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో నిర్వహించిన డీసీహెచ్‌బీ జనగణన– 2027 సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా లో ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయి లో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో మౌలిక వసతు లు, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు సమగ్ర సమాచారం ప్రధాన ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 400 అంశాలు, మున్సిపాలిటీలకు సుమారు 420 అంశాల సమా చారాన్ని సంబంధిత శాఖల నుంచి సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. విద్యకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, వాటి నిర్వహణ విధానం, దూరం తదితర వివరాలను నమోదు చేయాలన్నారు. వైద్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యసిబ్బంది, పడకల సంఖ్య, పారామెడికల్ సిబ్బంది, మెడికల్ షాపుల వివరాలను సేకరించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, పోస్టల్, మొబైల్ నెట్‌వర్క్, విద్యుత్, బ్యాంకింగ్, భూముల వినియోగం, సాగునీరు, వ్యవసాయం, పశుసంవర్ధక, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు. డేటా సేకరణ, పరిశీలన, అవసరమైన సవరణల ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. వచ్చే వారంలో మండల, జిల్లా స్థాయిలో సమీక్షించి.. ప్రతి గ్రామ పంచాయతీలో డేటా సేకరణ పురోగతి, అధికారుల ధ్రువీకరణపై పరిశీలన చేస్తామని తెలిపారు.
● ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి.. వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించి, అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి పాల్గొన్నారు.


