దామరగిద్ద: ఈ ప్రాంత రైతుల కోసం దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి కలను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్యెల్యేలు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కాన్‌కుర్తి రిజర్వాయర్ దగ్గర నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు సాధనలో రెవెన్యూ అధికారులు, అఖిలపక్ష నాయకుల కృషి ఉందన్నారు. 800 ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు మధ్యవర్తిత్వం లేకుండా ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ముందే పరిహారం డబ్బులు అందజేసిన ఘనత భారతదేశ చరిత్రలోనే లేదన్నారు. పేరపళ్ల భూ సేకరణలో ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడమేనని మండిపడ్డారు. ధైర్యం ఉంటే స్థానిక రైతుల దగ్గరకు వచ్చి అడిగితే సమాధానం చెబుతారన్నారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మాత, శిశు ఆస్పత్రి, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. నదీ జలాలకు 300 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతానికి పైప్‌ల ద్వారా కాకుండా కాల్వల ద్వారా ఎలా నీటిని సరఫరా చేస్తారో చెప్పాలన్నారు. అనంతరం ప్రాజెక్టు పనులను విలేకర్లకు చూపించారు. కార్యక్రమంలో కాన్‌కుర్తి సర్పంచ్ నారాయణ మల్‌రెడ్డిపల్లి సర్పంచ్ శ్వేతా శివకుమార్, ఏఎంసీ చైర్మన్ సదాశివారెడ్డి, విండో అధ్యక్షుడు ఈదప్ప, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


