చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం – 2025కిగాను సంత్ కబీర్ అవార్డులు, జాతీయ చేనేత అవార్డులకుగాను అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు డి.బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంత్ కబీర్ అవార్డుకు గతంలో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు పొందిన చేనేత కళాకారులు (వీవింగ్ కేటగిరి) అర్హులని.. 31.12.2025 నాటికి 50 ఏళ్ల వయస్సు, చేనేత రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. అలాగే జాతీయ చేనేత అవార్డుకు 31.12.2025 నాటికి 30 ఏళ్లలోపు వయస్సు, చేనేత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని సూచించారు. ఇతర రంగాల్లోని కళాకారులు 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయస్సు కలిగి చేనేత రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల చేనేత కార్మికులు వీవింగ్, డిజైనింగ్ కేటగిరీ కింద www.handlooms.nic.in వెబ్‌సైట్‌లో 23.03.2026 లోగా దరఖాస్తు చేసుకొని, అట్టి దరఖాస్తును చేనేత సేవాకేంద్రం, హైదరాబాద్‌లో (Weavers Service Centre, Chenetha Bhavan, 2nd foor, Nampay, Hyderabad) సమాచారం ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు సహాయ సంచాలకులు, చేనేత, జౌళిశాఖ, మహబూబ్‌నగర్ నారాయణపేట కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.
ప్రశాంతంగాఇంటర్ పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం 15 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లీష్ పరీక్ష జరగగా 3,808 మంది విద్యార్థులకుగాను 3,750 మంది హాజరుకాగా.. 58 మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,264 మందికిగాను 3,220 మంది హాజరుకాగా.. 44 మంది పరీక్ష రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 544 మందికిగాను 530 మంది హాజరుకాగా.. 14 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. అంతకుముందు విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఉపాధ్యాయులకురాష్ట్రస్థాయి పురస్కారాలు
నారాయణపేట రూరల్: విద్యాశాఖ నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన జిల్లా ఉపాధ్యాయులు శనివారం రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందుకున్నారు. జిల్లా నుంచి హరిసూదన్‌రెడ్డి (పల్లెర్ల), నరేష్ (కంసాన్పల్లి), రమ్య (కర్నె), భువనేశ్వరి (కొల్లంపల్లి), సురేందర్ (శివాజీనగర్), భారతి (గుండుమాల్) ఎంపికకాగా.. వీరికి హైదరాబాద్‌లో ప్రశంసాపత్రం అందించి అభినందించారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్ అభినందించారు.
నేడు విద్యుత్ సరఫరానిలిపివేత
నారాయణపేట రూరల్: మండలంలోని చిన్నజట్రంలో ఉన్న 33 కేవీ ఉప విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏఈ సాయినాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని అంతారం, అయ్యవారిపల్లి, లక్ష్మీపూర్, బోయిన్‌పల్లి, స్వాములవారితండాలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని.. రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
చింతపండు క్వింటా రూ.9 వేలు
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.9 వేలు, కనిష్టంగా రూ.5,039 ధర పలికింది. శనగలు రూ.5,259, చింతపండు బోటు రూ.2,552–రూ1,919, పెసర రూ.8,061–రూ.6,506, ఆలసందలు రూ.6, 175–రూ.4,025, తెల్ల కంది రూ.7,609, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,829, కనిష్టంగా రూ.5,189 ధరలు లభించాయి.
చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


