దరఖాస్తుల పరిశీలన వేగవంతం
నారాయణపేట: మీ–సేవా ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్‌ను వినియోగించి దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జీపీఓలకు యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై పలు సూచనలు చేశారు. మీ–సేవా కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను రూపొందించిందని, సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులు డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో పరిశీలనకు వెళ్లి అక్కడ తుది ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఆదాయ, నివాస, కుల ధ్రువపత్రాల దరఖాస్తులు త్వరగా పరిష్కరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడంతో ప్రజలకు సమయ పాలనతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని వివరించారు. శిక్షణలో యాప్ డౌన్‌లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు, ఫొటో అప్‌లోడ్, రిపోర్ట్ సమర్పణ తదితర అంశాలపై ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ కొంగళి విజయ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారుల సందేహాలను నివృత్తి చేసి, యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా మీ–సేవా సూపరింటెండెంట్ దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


