రేర్ డిసీజెస్.. బీ అలర్ట్!
జన్యుపరమైన లోపాలతోనూ చర్మవ్యాధులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో చర్మ సంబంధిత వ్యాధుల శాతం పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌తోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో డెర్మటాలజీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పరిశుభ్రత, పోషకాహారంతోపాటు జీవనశైలిలో లోపాలు, వాయు, జల కాలుష్యంతో చర్మ వ్యాధుల బారినపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్‌తోపాటు పలు పరిశోధన సంస్థల అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. జన్యుపరమైన లోపాలతో సైతం స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బాధితులు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు అతి తక్కువే. తాజాగా ఉమ్మడి పాలమూరులో ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడిన కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ధన్వాడ మండలంలో..
గతంలో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జన్యు లోపాలతో చర్మ వ్యాధుల బారిన పడిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్‌పల్లితోపాటు దాని చుట్టు పక్కల గ్రామాల్లో ఇలాంటి బాధితులు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. వీరిలో పలువురు ఏనుగొండలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు.
అరి చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోయి..
హనుమాన్‌పల్లి గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1,425 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 728, మహిళలు 697 మంది. వీరిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు 250 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వర్గానికి చెందిన సుమారు 25 నుంచి 30 మంది వరకు జన్యు లోపాలతో వచ్చిన చర్మ వ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అధిక సంఖ్యలో ప్రధానంగా పామోప్లాంటార్ కెరటోడర్మా వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అరి చేతులు, పాదాలు మందమై.. స్పర్శ కోల్పోవడం, చర్మం పగుళ్లు రావడం, నడిచేటప్పుడు, ఏదైనా పనిచేసేటప్పుడు నొప్పి ఉండడం, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు.
నేడు ‘ఎస్‌వీఎస్’ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్
రేర్ డిసీజెస్ డే సందర్భంగా జన్యు లోపాలతో చర్మ వ్యాధులకు సంబంధించి ధన్వాడ మండలంలోని హనుమాన్‌పల్లిలో ఎస్‌వీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఎస్‌వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ రెసిడెంట్ డైరెక్టర్ కె.రాంరెడ్డి తెలిపారు. జన్యు లోపాలతో చర్మవ్యాధుల బారిన పడినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అవగాహన లోపంతో చికిత్సకు రారని.. ఇలాంటి వారికి అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఆ తర్వాత అవసరమయ్యే వారికి చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. హనుమాన్‌పల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జన్యు లోపాలతో చర్మ వ్యాధులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు డాక్టర్లతో వెబినార్లు మాత్రమే జరిగాయని.. స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని వివరించారు.
ఈ వ్యాధులు సైతం..
మరికొందరిలో నెథర్టాన్ సిండ్రోమ్ (చర్మం ఎర్రగా, పొడిగా ఉండి పొలుసుల్లా ఊడిపోవడం, తీవ్ర దురద, వెంట్రుకలు రాలిపోవడం), ఇచ్‌థియోసిస్ (చర్మం చాలా పొడిగా ఉండి పొలుసుల్లా ఊడిపోవడం, చర్మం గట్టి పడడం), ఎపిడెర్మలైసిస్ బుల్లోసా (పుట్టిన పిల్లల చర్మం చిట్లిపోయి ఊడిపోవడం), ఎక్రోడెర్మాటిటిస్ ఎంటరోపాథికా (నోరు, ముక్కు, కళ్ల చుట్టూ ఎర్రగా మారి ప్యాచ్‌లు ఏర్పడడం, చేతులు, కాళ్ల చివరి భాగాల్లో పొడిగా ఉంటూ పొలుసుల్లా ఊడిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం), ఎరిత్రోపోయెటిక్ పర్ఫీరియా (సూర్యరశ్మి తగిలితే చర్మం మండడం, ఎర్రబారడం, బుడగలు, గాయాలు, మచ్చలు రావడం) వంటి రుగ్మతలు ఉన్నాయని ఎస్‌వీఎస్ ఆస్పత్రి ఎండీ, డెర్మటాలజిస్ట్ శరత్‌చంద్ర వెల్లడించారు.
అవగాహన లేకపోవడంతో అనేక ఏళ్లుగా ఇబ్బందులు
తాజాగా ఉమ్మడి పాలమూరులో వెలుగులోకి..
రక్త సంబంధీకుల మధ్య వివాహాలేకారణమంటున్న వైద్యులు
రేర్ డిసీజెస్.. బీ అలర్ట్!


