గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
ఊట్కూర్/మాగనూర్: గ్రామాల్లో ప్రజలు, నాయకులు పార్టీలను కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాలని, తర్వాత ఎవరు గెలిచినా అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఊట్కూరు మండలం పులిమామిడిలో రూ.2.20 కోట్లతో నిర్మించే విద్యుత్ సబ్‌స్టేషన్, మాగనూరు మండలం వడ్వాట్‌లో సబ్‌స్టేషన్, గురువా లింగంపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రతి నాలుగు గ్రామాలకు ఒక సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో నియోజకవర్గంలో 1,035 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో రైతులకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పులిమామిడిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ త్రివేణి, ఎస్‌ఈ నవీన్‌కుమార్, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ కిశోర్‌కుమార్, నాయకులు లక్ష్మారెడ్డి, సూరయ్యగౌడ్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, వడ్వాట్‌లో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, గురువలింగంపల్లి సర్పంచ్ ఈడిగి లక్ష్మీదేవమ్మ, డీఈ నర్సింహరావు, సివిల్ ఈఈ ప్రవీణ్‌కుమార్, ఏఈ గంగాధర్‌రావు, నాయకులు ఆనంద్‌గౌడ్, శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, నర్సింహులు, ముద్దు రాములు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి


