బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్
నారాయణపేట: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఫణీందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్‌లోని చాంబర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. 15 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లీష్ పరీక్ష జరగగా.. 4,557 మంది విద్యార్థులకుగాను 4,415 మంది హాజరయ్యారు. 142 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. రెగ్యులర్ విద్యార్థులు 4,048 మందికిగాను 3,926 మంది హాజరుకాగా.. 122 మంది పరీక్ష రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 509 మందికిగాను 489 మంది హాజరుకాగా.. 20 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పోలీసు అధికారులు పర్యవేక్షించారు. అంతకుముందు విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
3వ తేదీనే హోలీ పండుగ
నారాయణపేట రూరల్: హోలీ పండుగను మంగళవారం జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్నా జగదీష్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మురళి భట్టడ్, ప్రవీణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2న పౌర్ణమి ఉండటంతో కాముడి దహనం చేసి 3వ తేదీన రంగుల పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. అలాగే 19న ఉగాది, 27న శ్రీరామనవమి నిర్వహించుకోవాలని సూచించారు.
శనగలు క్వింటా రూ.5,250
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం శనగలు క్వింటా గరిష్టంగా రూ.5,250, కనిష్టంగా రూ.5,212 ధర పలికింది. అలాగే ఆముదాలు రూ.5,605, పెసర రూ.7,787, వేరుశనగ గరిష్టంగా రూ.9,370, కనిష్టంగా రూ.5,252, ఆలసందలు రూ.7,919–రూ.6,440, కంది తెల్లవి రూ.7,589–రూ.7,419, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,919, కనిష్టంగా రూ.6,440 ధరలు లభించాయి.
బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్


