చదివి.. రాయగలరా?
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు అంచనా వేసినందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు సాధించేలా కృత్యాధార బోధన కొనసాగేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న బోధన, చిన్నారుల చదువు పరీక్షించేందుకు రెండోతరగతి విద్యార్థులపై సర్వే చేపడుతోంది. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడురోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుండగా శుక్రవారంతో ముగియనుంది. సర్వేలో గుర్తించిన అంశాల ఆధారంగా కనీస సామర్థ్యాలను మరింత మెరుగ్గా అందించనున్నారు.
సర్వే కొనసాగేది ఇలా..
ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే సర్వే కొనసాగిస్తారు. ఇందుకుగాను జిల్లాకేంద్రం సమీపంలోని బీఈడీ కళాశాల ఛాత్రోపాధ్యాయుల ను ఎంపికచేసి వారికి శిక్షణ సైతం ఇచ్చారు. వారు సంబంధిత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో సర్వే చే స్తారు. బొమ్మను చూపిస్తూ మాట్లాడించడం, తెలు గు, ఆంగ్లం అక్షరాలు, పదాలు, వాక్యాలను చదివిస్తారు. అదేవిధంగా అక్షరాలు, పదాలు రాయించడం గణితంలో కూడిక, తీసివేత, గుణాకారం, భాగాహారం తదితర సామర్థ్యాలను పరిశీలిస్తారు. ప్రతి పాఠశాలలో 8మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించి వారు చెప్పిన సమాధానాలు మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు.
ఉపాధ్యాయులకు సైతం..
సర్వేకు వెళ్లిన పాఠశాలలో విద్యార్థులతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులకు సైతం పరీక్ష నిర్వహిస్తారు. ఛాత్రోపాధ్యాయులు తీసుకెళ్లిన ప్రశ్నావళిని ఉపాధ్యాయులతో పూర్తి చేయించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరు సైతం నిర్ధారిస్తారు. పిల్లల ప్రతిభ ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
మూడురోజుల్లో పూర్తి..
విద్యార్థుల స్థాయిని నిర్ధారించేందుకు ఎన్‌సీఈఆర్టీ చేపడుతున్న సర్వే ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో మూడురోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 25న తెలుగు, ఉర్దూ, 26న గణితం, 27న ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి సామర్థ్యాలను పరిశీలిస్తారు. వాటిని ట్యాంజెన్రియన్ యాప్‌లో పొందుపరుస్తారు. పరీక్ష నిర్వహణ తీరు, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై ఛాత్రోపాధ్యాయులకు డీఆర్పీలు రెండ్రోజుల పాటు శిక్షణనిచ్చారు. సర్వేలో పాల్గొన్న ఛాత్రోపాధ్యాయులకు రోజుకు రూ.500 చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తారు.
విద్యార్థితో చదివిస్తున్న ఛాత్రోపాధ్యాయురాలు
జిల్లాలో విద్యార్థులసామర్థ్యాల పరిశీలన
రెండోతరగతి చిన్నారులకు ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్ష
నేటితో పూర్తికానున్న సర్వే
క్షేత్ర పరిశీలకులుగా ఛాత్రోపాధ్యాయులు


