క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

Feb 27 2026 8:17 AM | Updated on Feb 27 2026 8:17 AM

క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

ఎస్పీ డా. వినీత్‌

నారాయణపేట: పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించి శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని ఎస్పీ వినీత్‌ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో హెడ్‌క్వార్టర్స్‌లోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు సిబ్బంది, హోంగార్డులతో ఆయన పోలీస్‌ దర్బార్‌ నిర్వహించారు. సర్వీస్‌కు సంబంధించిన సమస్యలు, హెడ్‌క్వార్టర్స్‌లో శుద్ధజల కేంద్రం ఏర్పాటు, వారాంతపు సెలవులు, పెండింగ్‌ బిల్లులు తదితర సమస్యలు తెలియజేశారు. స్వయంగా విన్న ఎస్పీ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసుశాఖలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది, హోంగార్డుల పాత్ర అత్యంత కీలకమని.. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులు, ప్రత్యేక ఆపరేషన్లు, పండుగలు, ఎన్నికల సమయంలో వీరి సేవలు అత్యంత ప్రధానమన్నారు. సిబ్బంది సంక్షేమమే ప్రధానమని.. విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వసతి, డ్యూటీ సమయాలు తదితర అంశాలను అధికారులకు నేరుగా తెలియజేయాలని సూచించారు. సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, కుటుంబాలను బాగా చూసుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పోలీసుశాఖపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. హోంగార్డులు పోలీసు కుటుంబంలో భాగమేనని.. వారి సేవలు అమూల్యమని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌, ఆర్‌ఐలు నర్సింహ, విజయభాస్కర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ శంకర్‌లాల్‌, ఆర్‌ఎస్‌ఐలు శ్వేత, కృష్ణచైతన్య, శివన్న, ఏఆర్‌ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement