అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అమరచింత: ఇందిరమ్మ ఇంటి పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో శ్రీనివాస్‌రెడ్డి, సంధ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి మంత్రి తన సతీమణి వాకిటి లలితతో కలిసి హాజరై శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు కానుక అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మొదటి విడతలో అర్హులై ఇంటి స్థలం కలిగిన వారికి మంజూరు చేశామని చెప్పారు. మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, సర్పంచ్ శివకుమార్, అరుణ్‌కుమార్, జగన్‌రెడ్డి, ఆశిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


