ప్రణాళికతోనే ఫలితం | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతోనే ఫలితం

Feb 23 2026 9:15 AM | Updated on Feb 23 2026 9:15 AM

ప్రణా

ప్రణాళికతోనే ఫలితం

అందమైన చేతిరాతతో మంచి మార్కులు

ఆహారపు అలవాట్లు ప్రధానమే

పంచ సూత్రాలు.. ఉత్తమ ఫలితాలు

పరీక్షల వేళ విద్యార్థులకు నిపుణుల సూచనలు

నారాయణపేట రూరల్‌: పదోతరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ప్రణాళికతో చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలంటేనే విద్యార్థులకు భయం ఏర్పడటం సహజం. ఇలాంటి సమయంలో నేర్పుతో ఆందోళనను దూరం చేసుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుంటుంది.

అధ్యాపకులు ఇలా చేయాలి..

జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దు. ఇంటివద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవాలి. తీసుకునే ఆహారం.. ఆందోళనకు గురికాకుండా తరచూ తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేలా ప్రోత్సహించాలి. ఇప్పటికై నా మించింది లేదు.. ఇక నుంచి చదివినా చాలు విజయం మీ సొంతం అంటూ వారిలో ప్రేరణ కలిగించేందుకు ప్రయత్నించాలి.

విద్యార్థులతో చేయకూడనివి..

విద్యార్థులను ఇతరులతో పోల్చి తక్కువ చేసి చూడొద్దు. తల్లిదండ్రులు వారితో కలిసి కడుపు నిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో వారి అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. తల్లిదండ్రులు, అధ్యాపకులు వారి ఆశలను పిల్లలపై రుద్ది చదవాలంటూ తరచూ వేధించరాదు.

అందమైన దస్తూరితో..

పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అందమైన చేతిరాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలు ఆకట్టుకునేలా గుండ్రంగా రాస్తూ పదాలకు మధ్య సమదూరం పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, దోషాలు, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి.

సాత్విక ఆహారం తీసుకోవాలి..

పరీక్షల సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం, నీటిశాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు ఎక్కువగా తినాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

– డా. గందె కార్తీక్‌,

జనరల్‌ ఫిజీషియన్‌, నారాయణపేట

ప్రశాంత వాతావరణంలో చదవాలి..

పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికావొద్దు. మార్కులపై దృష్టి సారిస్తూ బెంగ పడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతతతోనే ఉత్తీర్ణత సాధిస్తాం. మెదడు చురుగ్గా పనిచేసేలా ఉత్తేజం కావాలి.

– పటేల్‌ రాంరెడ్డి, నాయకుడు, ప్రభుత్వ అధ్యాపకుల సంఘం

ఉత్సాహంగా పరీక్షలు రాయాలి

ప్రశాంతంగా ఉండి ఉత్సాహంతో పరీక్షలకు హాజరుకావాలి. గంటల తరబడి చదవాలనే నియమం లేదు. ప్రశాంత వాతావరణంలో చదవాలి. ఇతర విషయాలపై దృష్టి సారించొద్దు. ఇప్పటి వరకు చదివిన అంశాలనే పునశ్ఛరణ చేసుకోవాలి. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి.

– సుదర్శన్‌రావు, డీఐఈఓ, నారాయణపేట

వైద్యులతో కౌన్సిలింగ్‌..

పరీక్షలంటే ఒత్తిడికి గురై భయపడే విద్యార్థులకు వైద్యులతో కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలో తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు, సూచనలు చేయాలి. పౌష్టికాహారం, సరైన నిద్ర, యోగా, ధ్యానం చేసేలా ప్రోత్సహించాలి. టీవీ, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాలి.

ప్రణాళికతోనే ఫలితం 1
1/3

ప్రణాళికతోనే ఫలితం

ప్రణాళికతోనే ఫలితం 2
2/3

ప్రణాళికతోనే ఫలితం

ప్రణాళికతోనే ఫలితం 3
3/3

ప్రణాళికతోనే ఫలితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement