ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
● ఈ నెల 25 నుంచి ప్రారంభం
● ఆన్‌లైన్ హాల్‌టికెట్లకు అనుమతి
● హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్
● ‘సాక్షి’తో డీఐఈఓ సుదర్శన్‌రావు
సుదర్శన్‌రావు, డీఐఈఓ
నారాయణపేట రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25న ప్రారంభమై మార్చి 16న ముగియనున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిపేందుకు విద్యార్థులను సన్నద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సుదర్శన్‌రావు తెలిపారు. శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. ఆయన మాటల్లోనే..
15 కేంద్రాలు.. 8,192 మంది విద్యార్థులు...
జిల్లాలో 45 జూనియర్ కళాశాలలు ఉండగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,409 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,783 మంది మొత్తం 8,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పరీక్షల నిర్వహణకు 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, నలుగురు అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్, మరొక సిట్టింగ్ స్కాడ్ బృందాలను నియమించాం. వీరి పర్యవేక్షణకు ఒక కన్వీనర్, ఇద్దరు సభ్యులతో డీఈసీ కమిటీ ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల నిఘాలో..
అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 14 వరకు కెమెరాలు ఉన్నాయి. ఇంటర్‌బోర్డు కమాండ్ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేయడంతో ఉన్నతాధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు పరీక్ష సమయంలో మూసి ఉంచాలి.
కనీస సౌకర్యాల కల్పన..
పరీక్ష కేంద్రాల్లోని ప్రతి గదిలో ఫ్యాన్, లైట్ ఉండేలా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు వినియోగించుకునే విధంగా సిద్ధం చేశాం. వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాం. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ పరీక్షా సమయానికి బస్సులను కేంద్రాల వరకు నడపనుంది.
విద్యార్థులు సన్నద్ధం..
ఈ ఏడాది ఉత్తీర్ణతలో జిల్లాను రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిపేందుకు అవసరమైన విధంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశాం. సిలబస్ పూర్తిచేసి ప్రత్యేక తరగదులు నిర్వహించాం. పరీక్షల కోసం 90 రోజుల ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా మాదిరి ప్రశ్నపత్రాలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహించారు. చేసిన తప్పులను విద్యార్థులకు తెలియజెప్పి సరిదిద్దుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఈ ప్రక్రియ ఉత్తీర్ణత శాతం పెంపుతో పాటు రాష్ట్రస్థాయి మార్కుల సాధనకు తోడ్పాడనుంది.
నిమిషం నిబంధన ఎత్తివేత..
విద్యార్థులు పోర్టల్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్షకు హాజరుకావచ్చు. ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశాం. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేశారు. ప్రైవేట్ కళాశాలలు ఫీజు కోసం విద్యార్థులను ఇబ్బందిపెట్టి హాల్‌టికెట్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటాం.
ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు


