ప్రజలకు ఉత్తమ పాలన అందించాలి
సర్పంచుల శిక్షణలో
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: కొత్తగా ఎన్నికై న సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకొని తమ గ్రామాల్లో ఉత్తమ పరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఆదేశానుసారం గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో సర్పంచుల 3, 4వ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో సర్పంచుల శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. డిసెంబర్ 24న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలోని కోస్గిలో కొడంగల్ నియోజకవర్గ సర్పంచులను సన్మానించారని చెప్పారు. 5 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు 2018 పంచాయతీరాజ్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అధికారాలు వివరించారని తెలిపారు. మున్ముందు మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకుందామని.. వేసవి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పారిశుద్ధ్యం, ఉపాధిహామీ పనులు పరిశీలించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు 100 శాతం నిర్మించాలని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
శాంతిభద్రతలు పరిరక్షించాలి..
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో సర్పంచుల పాత్ర కీలకమని ఎస్పీ డా. వినీత్ అన్నారు. దేశాభివృద్ధి గ్రామం నుంచే ప్రారంభమవుతుందని.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచుల పాత్ర ముఖ్యమన్నారు. దేశంలో ఇద్దరిని మాత్రమే పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నుకుంటారని.. అందులో ఒక్కటి రాష్ట్రపతి, మరోటి సర్పంచ్ అని తెలిపారు. త్వరలో మంచి కార్యక్రమం ద్వారా గ్రామానికి పోలీసు వస్తారని, ప్రతి గ్రామంలో ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం సర్పంచ్‌లకు కలెక్టర్, ఎస్పీ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓలు శ్రీధర్, రమేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


