ముగిసిన ఓఎస్‌సీ సర్వే
జిల్లాలో తేలిన బడిబయటి చిన్నారుల లెక్క
● జనవరి నుంచి 40 రోజుల పాటు కొనసాగిన సర్వే
● నిర్బంధ విద్య అందిస్తామంటున్న అధికారులు
నర్వ: జిల్లాలో బడిబయటి పిల్లల సంఖ్య తగ్గడం లేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా వారి సంఖ్య అధికంగానే ఉంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లోని సీఆర్పీలు 40 రోజుల పాటు సర్వేచేసి విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పాఠశాలకు వెళ్లని 15 నుంచి 19 ఏళ్లలోపు వారిని గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేమి కారణంగా జిల్లాలో 217 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. వారిని స్థానిక పాఠశాలలు లేదా కస్తూర్బా, గురుకులాల్లో చేర్పించే చర్యలు చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
నామమాత్రంగానే..
బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే నవంబర్ 15న ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కాగా డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సర్వే నామమాత్రంగా సాగింది. జనవరి రెండోవారం నాటికి ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా పర్యవేక్షించే అధికారి లేకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా వివరాల నమోదు పూర్తి కాలేదు. గతేడాది సర్వేలో 333 మంది విద్యార్థులు బడిబయట ఉన్నట్లు గుర్తించగా.. ఈసారి ఆ సంఖ్య 217కి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నా.. సర్వేపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది సీఆర్పీలు క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ఉన్న చోటే వివరాలు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సర్వేలో గుర్తించిన అంశాలు..
చదువుకోవాల్సిన వయసులో వీధుల్లో ఉంటున్న వారి వివరాలను రెండు గ్రూప్‌లుగా వర్గీకరించారు. 6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు ఒక గ్రూప్‌గా.. 15 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికల మరో గ్రూప్‌గా విభజించి సేకరించిన వివరాలను ప్రబంద్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. విద్యాసంస్థలు తెరిచాక వయస్సు ఆధారంగా ఆయా తరగతుల్లో చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
● బడిబయటి పిల్లలను గుర్తించిన అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అందుబాటులో ఉండే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అంతేగాకుండా బాలురు, బాలికలకు వేర్వేరుగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్‌ఎస్), స్పెషల్ ట్రైనింగ్ సెంటర్(ఎస్‌టీసీ), సర్వేలో మైగ్రేటెడ్ (వలస పిల్లల కోసం) రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైనింగ్ సెంటర్లు (ఆర్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేసి బడిబయటి పిల్లలకు విద్యను అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇవేగాకుండా ఇటుక బట్టీలు, కర్మాగారాల వద్ద పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం వర్క్‌సైట్ స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడే విద్యనందించేందుకు యాజమాన్యాల సహకారంతో 14 ఏళ్లలోపు విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు.
ముగిసిన ఓఎస్‌సీ సర్వే
ముగిసిన ఓఎస్‌సీ సర్వే
ముగిసిన ఓఎస్‌సీ సర్వే


