ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణ
కోస్గి రూరల్: జిల్లాలోని గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం కోస్గి మండలం తోగాపూర్‌లో తహసీల్దార్ శ్రీనివాసులు భూ సేకరణపై నోటీసులు జారీ చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మొత్తం వెయ్యి ఎకరాల భూమి అవసరం కాగా.. తోగాపూర్‌లో 400 ఎకరాలు, వికారాబాద్ జిల్లా దుద్యాల, లగచర్ల గ్రామాల్లో 600 ఎకరాలు సేకరిస్తున్నారు. తోగాపూర్ శివారులోని 150–1 సర్వే నంబరులో గల 387.14 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో ప్రభుత్వ భూమి 175.22 ఎకరాలు ఉందని తహసీల్దార్ తెలిపారు. మిగతా భూమికి సంబంధించి కొందరికి పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భూ సేకరణపై నోటిఫికేషన్ విడుదలై 60 రోజులు దాటినా ఒక్క ఫిర్యాదు అందలేదని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియపై గురువారం ఆర్డీఓ రామచందర్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతారన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.


