టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి | - | Sakshi
Sakshi News home page

టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి

టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి

నారాయణపేట రూరల్‌: తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా నూతన అధ్యక్షుడిగా డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎం.నర్సింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ప్రభుత్వ గ్రౌండ్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, కార్యదర్శి చంద్రునాయక్‌ పర్యవేక్షణలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించగా.. ఎన్నికల అధికారిగా రాజేశ్‌ వ్యవహరించారు. జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు హాజరై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దామోదర్‌, ఉపాధ్యక్షురాలిగా ఉదయభాను, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా శశికళ, కార్యదర్శిగా అజయ్‌, కోశాధికారిగా చిన్నబాలరాజ్‌తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన సభ్యులను శాలువా, పూలమాలలతో సన్మానించి నియామక పత్రాలను అందజేశారు.

వేరుశనగ క్వింటా రూ.9,040

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 9,040, కనిష్టంగా రూ. 3,500 ధర పలికింది. శనగలు గరిష్టంగా రూ. 5,162, కనిష్టంగా రూ. 4,982, అలసందలు గరిష్టంగా రూ. 6,219, కనిష్టంగా రూ. 5,855, వడ్లు (సోన) రూ. 2,239, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,139, కనిష్టంగా రూ. 6,800, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,129, కనిష్టంగా రూ. 7,012 ధరలు పలికాయి.

అద్దె ప్రాతిపదికనఆర్టీసీ బస్సులు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రానున్న పెళ్లిళ్లు, శుభాకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ సంతో ష్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రీజియన్‌లోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్‌ వాహనాల కంటే తక్కువ ధర ఉంటుందని, డ్రైవర్‌ బత్తా కట్టనవసరం లేదని, సౌకర్యవంతమైన బీఎస్‌6 అధునాతన టెక్నాలజీ కొత్త బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సులను బుకింగ్‌ చేసుకునేందుకు అచ్చంపేట 99592 26291, గద్వాల 99592 26290, కల్వకుర్తి 99592 26292, కొల్లాపూర్‌ 90004 05878, కోస్గి 99592 26293, మహబూబ్‌నగర్‌ 99592 26286, నాగర్‌కర్నూల్‌ 99592 26288, నారాయణపేట 99592 26293, మహబూబ్‌నగర్‌ 99592 26286, షాద్‌నగర్‌ 99592 26287, వనపర్తి 99592 26289 నంబర్లను సంప్రదించాలని కోరారు.

పీయూలో ప్రాంగణ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసీ, ఎంబీఏ విద్యార్థుల కోసం ఆమ్నీల్‌ ఆంకాలజీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. 80 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, రవికాంత్‌, అర్జున్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మన్యంకొండలో కోడె దూడల వేలం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన మొక్కుబడి కోడె దూడలకు బహిరంగవేలం నిర్వహించారు. మొత్తం 41 కోడె దూడలను వేలం వేయగా, వాటి ద్వారా దేవస్థానానికి రూ.1,13,100 ఆదాయం సమకూరింది. స్వామివారి సేవలో భాగంగా మొక్కులు తీర్చుకున్న భక్తులు సమర్పించిన ఈ కోడెదూడలను దేవస్థానం నియమావళి ప్రకారం వేలం ద్వారా విక్రయించారు. వేలం ప్రక్రియ దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. భక్తుల విశ్వాసం, సేవాభావంతో స్వామివారికి సమర్పించిన మొక్కుబడులు ఆలయానికి ఆదాయం వనరుగా మారడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement