బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
నారాయణపేట ఎడ్యుకేషన్: సమాజంలో నిర్వహించ తలపెట్టే బాల్యవివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేందర్‌గౌడ్ అన్నారు. జస్ట్ రైడ్ ఫర్ చిల్డ్రన్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల ప్రచార రథయాత్రను బుధవారం కలెక్టరేట్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రచార రథం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామంలో బాలల హక్కులపై అవగాహన కల్పిస్తూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం విజన్ సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నారాయణపేటను మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎక్కడైనా బాల్యవివాహం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 1098 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ అశోక్ శ్యామల, యాదయ్య, డీసీపీఓ కరిష్మా, విజన్ సంస్థ కోఆర్డినేటర్ రవికుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ నర్సింహులు, మహిళా సాధికారత విభాగం అధికారి నర్సింహులు, సఖి సీఏ క్రాంతిరేఖ పాల్గొన్నారు.


