బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి
● రుణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జరిగిన డీసీసీ సమావేశానికి చైర్మన్‌గా కలెక్టర్, కోన్వీనర్‌గా లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా 2025–26 వార్షిక రుణ ప్రణాళికకు సంబంధించి రూ. 4204.49 కోట్ల బడ్జెట్‌కు గాను రూ. 2431.39 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంఎస్‌ఎంఈ సెగ్మెంట్ సంబంధించి రూ. 310.30 కోట్ల బడ్జెట్‌లో రూ. 144.77 కోట్లు వ్యవసాయేతర రుణాలు మంజూరు చేశారన్నారు. ఇది వార్షిక బడ్జెట్‌లో 46.65 శాతమని పేర్కొన్నారు. జిల్లా ప్రాధాన్యత రంగానికి రూ. 3833.48 కోట్లు కేటాయించగా.. రూ. 1938.71 కోట్ల రుణాలు అందించడం జరిగిందన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డు జిల్లా ప్రాధాన్యతా రంగానికి రూ. 4101.82 కోట్ల అంచనాలతో ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ప్రధానంగా పంట రుణాలు రూ. 2482.61 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం స్థిర మూలధన రుణం రూ. 816.26 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ. 67.79 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ. 325.08 కోట్లు అవసరమని అంచనా వేయడం జరిగిందన్నారు. బ్యాంకర్లు ప్రాధాన్యతా రంగాలకు త్వరితగతిన అధిక మొత్తంలో రుణాలు అందించి.. జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌బీఐ ఎల్‌డీఓవీ శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం షణ్ముఖాచారి, ఎస్‌బీఐ సీఎం క్రెడిట్ జఫార్ మొహిద్దీన్, యూబీఐ నుంచి సీఎం క్రెడిట్ టి.రాజేశ్ ఉన్నారు.
పకడ్బందీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వీసీలో అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ పాల్గొన్నారు.
● విద్యతోనే మహిళా సాధికారత, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో మహిళా, శిశుసంక్షేమశాఖ – జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్‌గౌడ్, బాలల సంక్షేమ మండలి చైర్మన్ అశోక్ శ్యామల, డీపీఆర్‌ఓ రషీద్, బాల్‌రాజ్, సీడీపీఓలు వెంకటమ్మ, రోజా, పార్వతి పాల్గొన్నారు.


