ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
కృష్ణా: చదువులో వెనకబడిన ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. మంగళవారం మండలంలోని ముడుమాల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై ఆరా తీశారు. విద్యార్థులకు ప్రణాళికా బద్ధంగా బోధించి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. సమయం వృథా చేయకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. కాగా, ముడుమాల్ ప్రాథమిక పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణంతో పాటు విద్యాభోదన అంశాలు ఆదర్శవంతంగా ఉన్నాయని డీఈఓ ప్రశంసించారు. డీఈఓ వెంట ఎంఈఓ నిజాముద్దీన్, మధ్యాహ్న భోజన పథకం కోఆర్డినేటర్ యాదయ్యశెట్టి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


