ఖర్చుకు తగ్గేదేలే..! | - | Sakshi
Sakshi News home page

ఖర్చుకు తగ్గేదేలే..!

Jan 20 2026 8:45 AM | Updated on Jan 20 2026 8:45 AM

ఖర్చుకు తగ్గేదేలే..!

ఖర్చుకు తగ్గేదేలే..!

నారాయణపేట: మున్సిపల్‌ చైర్మన్‌ గిరి కావాలా నాయనా.. అయితే రూ. 3కోట్ల నుంచి రూ.5 కోట్లు ఖర్చు పెట్టాలని అంటూ అధికార, ప్రతిపక్షాల పార్టీల బడా నేతలు ఆశావహులకు నేరుగా చెప్పేస్తున్నారు. ఆశావహులు సైతం డబ్బుకు కొదవలేదు.. ఎంతైనా ఖర్చు పెడతామంటూ స్పష్టంచేస్తూ.. బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకడుగు వేయమంటూ స్థిరాస్తి వ్యాపార, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రధాన పార్టీల నుంచి పోటీచేసి చైర్మన్‌ అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.

తెరవెనక చక్రం..

మద్దూర్‌ మున్సిపాలిటీలో ఓ వ్యక్తి తనను చైర్మన్‌ చేస్తే రూ.5 కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయనని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అధికార పార్టీని సైతం తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని.. పార్టీ నుంచి బీ–ఫాం ఇవ్వడమే ఆలస్యమని చెప్పినట్లు తెలుస్తోంది. ఓ నాయకుడు ప్రతి వార్డుకు రూ. 10లక్షలు కౌన్సిలర్‌గా పోటీచేసే తన ప్యానల్‌కు ఇస్తానంటూ చెప్పుకుంటూ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ మాత్రం చాపకింద నీరులా ఎవరిని రంగంలోకి దింపాలో.. చైర్మన్‌ గిరిని కై వసం చేసుకునే దిశగా తెరవెనక చక్రం తిప్పుతోంది.

డబ్బు ఉన్నోళ్లకే అందలం..

సీఎం ఇలాకాలోని కోస్గి, మద్దూర్‌ మున్సిపాలిటీలు ఒక ఎత్తయితే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో మరో విధంగా పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీ మాత్రం అత్తా కోడళ్లకు సవాల్‌గా మారనుంది. నారాయణపేటలో అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ బలంగా ఉంది. బీఆర్‌ఎస్‌ సైతం తక్కువేమీ కాదనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లా కేంద్రంలో అందలం ఎక్కాలంటే ఏ పార్టీ ఆశావహులైనా రూ. 4కోట్ల వరకు ఖర్చుచేస్తే తప్ప చైర్మన్‌ అయ్యే పరిస్థితి లేదంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలంటూ గత 10, 15 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసిన వారికి సైతం రూ. 3కోట్ల నుంచి రూ. 4కోట్లు ఉంటే చెప్పడి అంటూ బడా నేతలు నిర్మోహమాటంగా చెబుతుండటంతో నివ్వెరపోతున్నారు. పొత్తులో రెండు సీట్లు ఇస్తే రూ. 50లక్షలు ఇచ్చేందుకు సైతం ఓ పార్టీ మాజీ కౌన్సిలర్‌ అధికార పార్టీకి ఆఫర్‌ ఇచ్చినట్లు చర్చ కొనసాగుతోంది. అందులో పార్టీని నమ్ముకున్న వారికి టికెట్‌ ఇస్తారా.. లేక ఆఫర్‌ ఇచ్చిన వారికి టికెట్‌ ఇస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

కోస్గి, మద్దూర్‌లో పోటాపోటీ

సీఎం ఇలాకాలో కౌన్సిలర్‌ కావడం చాలా కాస్ట్‌ గురూ అంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి చైర్‌పర్సన్‌ అయ్యేందుకు దాదాపు రూ. 5కోట్లు ఖర్చయ్యాయని బహిరంగంగానే చర్చ కొనసాగింది. ఈ సారి సైతం అంతకు తగ్గదని.. ఏ వార్డులో చూసినా రూ. 30లక్షల నుంచి రూ.40 లక్షల ఖర్చు చేసేందుకు తగ్గేదేలేదంటూ ఆశావహులు పేర్కొంటున్నారు. అధికార పార్టీలోనే అధికంగా పోటీపడుతున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు సైతం తామేమీ తక్కువ కాదని.. తమ సిట్టింగ్‌ స్థానాల్లో తమకే అవకాశం కల్పించాలని పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది.

మక్తల్‌లో ‘మంత్రా’ంగంపైనే ఆశలు..

మక్తల్‌ మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి మనసులో ఎవరున్నారనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని ‘మంత్రా’ంగంతో తెరవెనుక రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎత్తుగడలను పసిగడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వ్యూహాలు రచిస్తున్నాయి. కౌన్సిలర్‌ కావాలంటే కనీసం రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షలు కావాల్సిందేనంటూ చర్చ కొనసాగుతోంది.

పుర పోరులో వ్యయానికివెనకాడని ఆశావహులు

ఒక్కో మున్సిపాలిటీలో రూ. 3కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం

మంద బలం.. మనీ ఉన్నోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్న పార్టీల నేతలు

రోజురోజుకు వేడెక్కుతున్న మున్సిపల్‌ రాజకీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement