గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకల నిర్వహణపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. 26న ఉదయం 9 గంటలకు పరేడ్ మైదానంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిభింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని తెలిపారు. గణతంత్ర వేడుకల సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓ గోవిందరాజులు ను ఆదేశించారు. అదే విధంగా ఆయా శాఖల అధికారులకు పలు బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ రామచందర్ తదితరులు ఉన్నారు.


