పుర చైర్మన్ పీఠంపై గురి!
నారాయణపేట: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి. తమకే టికెట్ ఇవ్వాలంటూ ఆశావహులు ప్రధాన నేతలను అభ్యర్థిస్తున్నారు.
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులున్నాయి. నారాయణపేట పుర పరిధిలోని 24 వార్డుల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డితో తమకు టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. బీఆర్‌ఎస్‌లో సైతం తమకు టికెట్ ఇవ్వాలంటూ ఆ పార్టీ ఆశావహులు మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని అభ్యర్థిస్తున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్‌కు ఆశవాహులు దరఖాస్తులు సమర్పించారు.
● నారాయణపేట పుర చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించారు. బీఆర్‌ఎస్‌లో మార్కెట్ మాజీ చైర్మన్ మసటి జ్యోతి, మాజీ కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ, మాజీ కౌన్సిలర్ అమ్మపల్లి శీరిష పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలోనూ పోటీ ఉండటంతో కౌన్సిలర్‌గా గెలుపొందిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, పుర మాజీ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కృష్ణ కోర్‌వర్, కాంట్రాక్టర్ గొల్ల రవికుమార్ సతీమణులను రంగంలోకి దింపి చైర్‌పర్సన్ చేయాలని అధికార పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ కౌన్సిలర్ రఘురామయ్యగౌడ్, మాజీ కౌన్సిలర్ సత్యరఘుపాల్‌రెడ్డి, బిల్డర్ వెంకట్రాములు సతీమణుల పేర్లు వినిపిస్తున్నాయి.
అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు
పేటలో పాగవేసేందుకు కాంగ్రెస్ కసరత్తు
ఎత్తుగడలో బీఆర్‌ఎస్, బీజేపీలు
సీఎం, మంత్రి ఇలాఖాలో సవాల్‌గా తీసుకుంటున్న ప్రతిపక్షాలు
ఊపందుకున్న
ఆశావహుల ప్రయత్నాలు
మంత్రి ఇలాఖాలో..
మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలోని మక్తల్ పుర చైర్మన్ స్థానం జనరల్ కావడంతో అధికారపార్టీ అందలం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. బీజేపీ మరోసారి పాగా వేయాలని ఎత్తుగడ వేస్తోంది. ఈసారి ఎలాగైనా పట్టు సాధించి గులాబీజెండా ఎగరరేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేశ్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ కట్టా సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీలో మాజీ చైర్‌పర్సన్ పావని భర్త మల్లికార్జున్, మాజీ వైస్ చైర్మన్ అఖిలరెడ్డి భర్త రాజశశేఖర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆనంపల్లి కొండయ్య ముదిరాజ్, బీఆర్‌ఎస్ నుంచి మార్కెట్ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్ సతీమణి ధనలక్ష్మి, పి.విష్ణువర్దన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఆయా పురపాలికల్లో ఎవరిని చైర్మన్ పీఠం వరిస్తుందో వేచి చూడాలి మరి.


