జిల్లా రద్దుచేస్తే అగ్నిగుండమే.. : బీఆర్‌ఎస్
నారాయణపేట: సకల జనుల ఉద్యమాలు.. పోరాటాలు...ఆందోళనలతో సాధించుకున్న నారాయణపేట జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తే అగ్నిగుండమే అవుతుందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 2019, ఫిబ్రవరి 17న నారాయణపేట జిల్లా ఏర్పాటు చేశారన్నారు. దీంతోనే మెడికల్, నర్సింగ్ కళాశాలలు, సమీకృత కలెక్టరేట్ తదితర అభివృద్ధి పనులు కొనసాగాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల విషయంలో విశ్రాంత న్యాయమూర్తితో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు కమిటీ వేస్తామని ప్రకటించిందని.. పుర ఎన్నికల్లో ఎక్కడ దెబ్బపడుతుందోనని కొత్త నాటకానికి తెర తీసిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని తమతో పంచుకున్నారని, బడ్జెట్ సెషన్‌లో కమిటీ వేస్తే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్ తర్వాత ఎంపీ స్థానాలు ఎన్ని ఉంటే అన్ని జిల్లాలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని. రాష్ట్రంలో 12 జిల్లాలు రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. జిల్లా ఏర్పాటుకు ఎలా పోరాటం చేశామో.. నిలుపుకోవడానికి అంతకు రెట్టింపు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కోర్టు, ఎస్పీ కార్యాలయ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల తరలివెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వైద్య కళాశాల ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రి భవనంలో కొనసాగుతోందని తెలిపారు. 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి నిర్మించి ఉంటే బాగుండేదని ఎంపీ అరుణ అంటుంది కానీ.. 12 ఏళ్ల కింద పీఎం వచ్చి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి వెళ్లారన్నారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు పార్లమెంట్‌లో ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు ఒక్కటే అనడానికి పాలమూరులో జరిగిన సీఎం సభ అని మరోసారి రుజువైందని చెప్పారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు విజయ్‌సాగర్, వేపూరి రాములు, సుదర్శన్‌రెడ్డి, కన్నా జగదీశ్, హన్మంత్‌రెడ్డి, దస్తగిర్ చాంద్, సురేందర్‌రెడ్డి, మహిమూద్ తదితరులు పాల్గొన్నారు.


