రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
● నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’పై అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ డా.వినీత్
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసుశాఖ అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పీ డా.వినీత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం కేవలం ఒక నినాదం కాకుండా.. రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్యమంలా ముందుకు సాగాలన్నారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సభ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే బాధితుల బాధ, మరణం సంభవించిన వారి కుటుంబ సభ్యుల మనోవేదనను ఎస్పీ స్వయంగా తెలియజేశారు. అలాంటి పరిస్థితి మరో కుటుంబంలో జరగకుండా.. అందరూ రహదారి భద్రత నియమాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం కేవలం చలానా, చట్టం నుంచి తప్పించుకోవడానికి కాదని.. అది తమ ప్రాణాన్ని కాపాడే ఆయుధమని ప్రతి వాహనదారుడు గ్రహించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాద మరణాలు జరిగి, ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంపై ఈ నెల 24వ తేదీ వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో స్వయంగా మాట్లాడించారు. అదే విధంగా డాక్టర్లతో రోడ్డు ప్రమాదానికి గురైతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే వివరాలను తెలియజేశారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, డీటీఓ మేఘాగాంధీ, ఆర్తోఫెడిక్ ప్రసాద్ శెట్టి, ప్రభుత్వ మార్చురీ డాక్టర్ తవ్ సిఫ్, ఆర్టీఓ జిల్లా మెంబర్ పోషల్ రాజేశ్ పాల్గొన్నారు.


