సాగునీటి కోసం మరో ఉద్యమం
నారాయణపేట రూరల్: సాగునీటి సాధన కోసం బీజేపీ మరో ఉద్యమం చేపడుతుందని.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదని, మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ తోడుదొంగలని, వారి నిర్లక్ష్యంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వనాశనం అయిందని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట సరిహద్దు తంగిడి నుంచి కృష్ణానది పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్ల దూరం తరలిపోతుంటే మన నీటిని మనం వాడుకోని దుస్థితి కల్పించారని అన్నారు. 2014 కన్నా ముందు ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు మాత్రమే ఇచ్చి నీటి కేటాయింపులు చేయకుండా కాంగ్రెస్ పచ్చి మోసం చేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను డీపీఆర్ లేకుండా పనులు మొదలుపెట్టి రూ.30 వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టి పంపిణీ కాల్వలు లేకుండా కమిషన్లు మెక్కి పాలమూరును ఎడారి చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబీజిరాంజీ పతాకంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తుందని ప్రజలు నమ్మొద్దని జిల్లా అద్యక్షుడు సత్య యాదవ్ ప్రజలను కోరారు. సిద్ది వెంకట్ రాములు, పోశాల్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.


