డయాలస్ట్రెస్!
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ‘కిడ్నీ’ బాధితులు
● వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికం
● అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు
● గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స
పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు.
● రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్‌లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్‌లో 963, డిసెంబర్‌లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం.


