యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట: యోగా సాధన ద్వారా వృత్తి జీవితంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, మానసిక–శారీరక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు గట్టు వద్ద పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో, యోగ గురువు శ్రీ సురేష్ మార్గదర్శకత్వంలో ప్రకృతి ఒడిలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగాభ్యాసకులు, దామరగిద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఎంహెచ్‌ఓ జయచంద్ర మోహన్, బీజేపీ నాయకులు నాగురావు నామాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, నిత్య యోగాభ్యాసం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగ గురువు సురేష్ వివరించారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ ఒత్తిడి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని, అలాంటి పరిస్థితుల్లో యోగ సాధన మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. డీఎంహెచ్‌ఓ జయచంద్ర మోహన్ మాట్లాడుతూ... యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా జీవన శైలిగా మారాలని, రక్తపోటు, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు. నాగురావు నామాజీ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సంపద యోగా అని, వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా సమాజంలో సానుకూల మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరసింహ, రాజు లహోటి, క్యాతన్ రఘు, అశోక్, వెంకటేష్, యశ్వంత్, సుదర్శన్, బాలాజీ, మల్లికర్జున్, నర్సింహులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం


