శాఖల సమన్వయంతోనే వ్యవసాయరంగ అభివృద్ధి
నారాయణపేట: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు రైతుల అభ్యున్నతికి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్/పీఎండీడీకేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్ కుమార్ ఆదేశించారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు శనివారం ఢిల్లీ నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతీక్‌జైన్ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌తో కలిసి పీఎండీడీకేవై సమితి సభ్యులతో రమణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వచ్చే ఆరేళ్లలో వ్యవసాయంతోపాటు ఉద్యానవన, మత్స్య పరిశ్రమ, పశుపోషణ పెంచేందుకు కృషిచేయాలని, మొత్తం 36 పథకాలను ఆయా మంత్రిత్వ శాఖల సహకారం తీసుకుని పురోగతి సాధించాలన్నారు. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి వచ్చి సమీక్ష చేస్తానని, పథకం సెంట్రల్ నోడల్ అధికారిగా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.
రైతులకు సకాలంలో రుణాలివ్వాలి
ప్రతీ నెల కలెక్టర్ నేతృత్వంలో సభ్యులు పీఎండీడీకేవై పురోగతిపై చర్చించి సమస్యలను అదిగమించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, ఆయా పథకాల అభివృద్ధికి నాబార్డు సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని అనుగొండ గ్రామంలో ఆక్వా పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని జిల్లా మత్స్య శాఖ అధికారి రహమాన్ తెలిపారు.ఆయా శాఖల అభివృద్ధి ప్రణాళికలను ఈశ్వర్‌రెడ్డి, డీఏఓ సుధాకర్, నోడల్ అధికారి సాయిబాబా వెల్లడించారు. కాగా పీఎండీ డీకేవై ఆరేళ్ల వార్షిక ప్రణాళిక పై తయారు చేసిన పూర్తిస్థాయి నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెంట్రల్ నోడల్ అధికారికి చూపించారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ హర్స్ చౌదరి, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ ఏజీఎం షణ్ముఖ చారి, ఎల్డీఎం విజయకుమార్, డీఎం ఓ బాలమణి పాల్గొన్నారు.


