తాలు పేరిట.. నిలువు దోపిడీ
అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
కిలోకు రూ.24చొప్పున నష్టం..
వానాకాలం సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్‌కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు.
రైతులకు ఫోన్లు చేసి మరీ..
కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్‌కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్‌కు4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఒక బస్తాలో 40.600 కిలోలు..
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది.
ఖరీఫ్‌లో రైస్ మిల్లర్లఅక్రమార్జన రూ.45 కోట్లు
క్వింటాల్‌కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ
ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు
తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో..
అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే..
మిల్లుల నిర్వాహకులకే
అధికారుల వత్తాసు
తాలు పేరిట.. నిలువు దోపిడీ
తాలు పేరిట.. నిలువు దోపిడీ


