అందుబాటులో సాగుకు సరిపడా యూరియా
నారాయణపేట: జిల్లాలో యాసంగి సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నారాయణపేట మండలంలో 125.82 ఎంటీఎస్, దామరగిద్దలో 33.16, ధన్వాడలో 47.12, కోస్గిలో 83.84, కృష్ణాలో 99.82, మద్దూర్‌లో 38.43, మాగనూర్‌లో 74.88, మక్తల్‌లో 300.05, మరికల్‌లో 60.30, నర్వలో 31.73, ఊట్కూర్ మండలంలో 52.26 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. అన్ని సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద యూరియాతో సహా ఇతర అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల పంపిణీ కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రతి రైతుకు ఎరువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడైనా యూరి యా సరఫరాలో సమస్య ఏర్పడితే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, దారి మళ్లించడం వంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


