
అంకితభావంతో పనిచేయాలి
● విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. విద్యార్థులకు నోట్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, ఉపాధ్యాయుల ముఖ హాజరు, అపార్ నమో దు, ఎఫ్‌ఎల్‌ఎన్, పాఠశాలల సందర్శన తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్‌లో మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు మెళకువలు పాటించాలన్నారు. నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తూ మరమ్మతు చేయిస్తున్నట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలను అధిగమిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించాలని.. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని కలెక్టర్ సూచించారు.
● కర్ని జీహెచ్‌ఎం బాదేపల్లి వెంకటయ్యగౌడ్ రచించిన ఉల్లాస్–అక్షరవికాసం ఆడియో, వీడియో పాటను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ పాటకు ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నర్సింహాచారి సంగీతాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉల్లాస్ అనేది నవభారత్ సాక్షరతా కార్యక్రమమని తెలిపారు. పాఠశాల విద్యావకాశం కోల్పోయిన 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యతా ప్రాథమిక విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యతలో కీలకమైన జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలు, నిరంతర విద్య అందిస్తున్నట్లు తెలిపారు. వయోజనులందరూ చదువుపై ఆసక్తి పెంచుకొని విద్యావంతులు కావాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీఈఓ గోవిందరాజులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లోవేగం పెంచండి
నర్వ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నర్వ మండలంలోని రాంపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలను కలెక్టర్ పరిశీలించి.. లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఇసుక కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు కలెక్టర్‌తో వాపోయారు. అయితే ఇసుక కొరతను అధిగమించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మల్లారెడ్డిని ఆదేశించారు. అంతకుముందు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులను నేలపై కూర్చొబెట్టడంపై కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. అనంతరం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరా తీశారు. కొందరు విద్యార్థులు భోజనం బాగులేదని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో బియ్యాన్ని మార్చాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాసులు ఉన్నారు.