
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
నారాయణపేట క్రైం: జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గణేశ్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో వచ్చేనెల 5, 6 తేదీల్లో గణేశ్ శోభాయాత్ర, 8న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించేందుకు మతపెద్దలు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఉత్సవాల సందర్భంగా పకడ్బందీగా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదని.. వారు ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు హెచ్చరించారు. శోభాయాత్ర సమయంలో ఇరువర్గాల మతపెద్దలు, పోలీసుల సమక్షంలో జెండాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో డీజేలను నిషేధించినట్లు తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్ తదితరులు ఉన్నారు.