
పీయూలో సబ్‌స్టేషన్ వివాదం!
రోడ్డు విస్తరణ పనుల్లో మరింత భూమి..
ఒక్క గజం ఎక్కువ తీసుకోం..
లేఖ రాశాం..
500 గజాలే కేటాయించామని పీయూ అధికారుల స్పష్టం
పాలమూరు యూనివర్సిటీలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. తాము 500 గజాల భూమిని కేటాయించామని పీయూ అధికారులు.. తమకు ఒక ఎకరా భూమిని కేటాయించారని ట్రాన్స్‌కో అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తాజాగా ఎకరంన్నర భూమిని చదును చేయడంపై అటు పీయూ అధికారులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు బాసటగా నిలిచే పీయూకు నూతన హాస్టల్స్, ల్యాబ్స్, తదితర వాటి ఏర్పాటు
నేపథ్యంలో మరింత భూమి సమకూర్చాల్సింది పోయి..ఉన్న భూమిని వేరే వాటికి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బండమీదిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలకు నాణ్యమైన విద్యుత్‌ను అందజేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు స్థలం కోసం వెతికారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీయూలో పీజీ కళాశాల పక్కన..రాయచూర్ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతితో విద్యుత్‌శాఖకు 500 గజాల భూమిని కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారు. సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా పనులు సైతం ప్రారంభించారు. అయితే, వారికి కేటాయించిన భూమికి మించి ఎక్కువ భూమిని చదును చేసుకుని వినియోగిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కేవలం 500 గజాలు ఇచ్చామని పీయూ అధికారులు పేర్కొంటుంటే, విద్యుత్ శాఖ తమకు ఒక ఎకరా భూమి కేటాయించారని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఎకరంన్నర భూమిని చదును చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఎక్కువ భూమిని ఎలా చదును చేసి వినియోగిస్తారంటూ ఇటీవల పీయూ వీసీ శ్రీనివాస్.. ట్రాన్స్‌కో అధికారులకు లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
ఎకరా కేటాయించారని
విద్యుత్ అధికారుల వాదన
అధిక భూసేకరణపై వీసీ లేఖ..
నేటికీ స్పందించని ట్రాన్స్‌కో
పీయూ భూమి కాపాడాలంటూ
విద్యార్థి సంఘాల ఆందోళన
పీయూకు ఆనుకుని ఉన్న వెటర్నరీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల భూమిని పీయూకు అధికారులు బదిలీ చేశారు. ఇందుకు 2019లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, వీసీ రాజతర్నం ఎంతో కృషి చేశారు. అయితే, గతేడాది భూత్పూర్– చించోలి రోడ్డు పనులు ప్రారంభం కాగా.. పీయూకు చెందిన భూమి సైతం పోయింది. పీయూ కాంపౌండ్ వాల్‌ను తొలగించి పనులు కొనసాగించారు. ఇటు రోడ్డు విస్తరణ, అటు సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం దాదాపు 5 ఎకరాల వరకు పీయూ భూమిని కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పీయూకు ప్రభుత్వం మరింత భూమిని కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులు పీయూకు భూమిని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తే.. ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడే పరిస్థితి లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇకనైన అధికారులు మేల్కొని పీయూ భూములను పరిరక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు.
పీయూలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం.
– సుధీర్‌రెడ్డి, ఈఈ, ట్రాన్స్‌కో
పీయూలో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్‌శాఖ అధికారుల విజ్ఞ్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్‌మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు.
– శ్రీనివాస్, పీయూ వైస్‌చాన్స్‌లర్

పీయూలో సబ్‌స్టేషన్ వివాదం!