
మట్టి గణపతులను పూజిద్దాం
ఫిర్యాదులు సత్వరం
పరిష్కరించాలి
నారాయణపేట: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బంది, ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమలను కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జలవనరులు కలుషితయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి.. పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళా, శిశుసంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బాల్యవివాహాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌లతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. బాలికలను రక్షిద్దాం–బాలికలను చదివిద్దాం అనే నినాదంతో బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్ధ, లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనకు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 40 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలన్నారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్.శ్రీను, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు శ్రీలత, కరీష్మ, సాయి, నర్సింహులు, అనిత, నర్సింహ, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.