
బాధితులకు భరోసానివ్వాలి : ఎస్పీ
నారాయణపేట క్రైం: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసానిచ్చేలా పోలీసు సిబ్బంది వ్యవహరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 10 అర్జీలు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో అందే ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం చేయరాదన్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ సూచించారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిష్కార మార్గం చూపాలని తెలిపారు.
ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కోస్గి రూరల్: కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్పరానికి గాను బీటెక్‌లోని సీఎస్‌ఈ, సీఎస్‌డీ, సీఎస్‌ఎం కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని.. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు ఈ నెల 26నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 29న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. టీజీఈఏపీసీఈటీ–2025 అర్హత సాధించిన విద్యార్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,300 కాగా.. అర్హత సాధించని విద్యార్థులు రూ. 2,100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
పరిహారం పెంచాలి
నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 42వ రోజుకు చేరాయి. భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.35 లక్షలు ఇవ్వాలని, ఇంటికి ఒక ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, గురుకుల, సైనిక మాడ్రన్ పాఠశాలలో భూ నిర్వాసితుల కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రిలే దీక్షలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మరాజుగౌడ్, సామాజిక కార్యకర్త కృష్ణా మడివాల్, మల్లేష్ శ్రీనివాస్, వెంకటప్ప ఉన్నారు
అలసందలు క్వింటాల్ రూ.6,229
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం అలసందలు క్వింటాల్ గరిష్టంగా రూ. 6,229, కనిష్టంగా రూ. 3,826 ధర పలికింది. అదే విధంగా పెసర గరిష్టంగా రూ. 9,859, కనిష్టంగా రూ. 4,322 ధరలు వచ్చాయి.

బాధితులకు భరోసానివ్వాలి : ఎస్పీ