
పత్తికి వాన గండం!
మరికల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి చేల్లో నీరు చేరడంతో పంటతోపాటు ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉండడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతుండడంతో భయం వెంటాడుతోంది. దీనికితోడు తేమశాతం పెరిగి పత్తి పూత నేలరాలుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రైతులు అధికంగా పత్తి పంటను నమ్ముకున్నారు. పత్తి సాగు చేసిన నాటి నుంచి కాపు దశకు వచ్చే వరకు వర్షాలు వెంటాడుతుండడంతో పంట దిగుబడులు సగానికి తగ్గిపోయే ప్రమాదం ఉందని, పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావోనని దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో పత్తి చేల్లో కలుపు సమస్య, తెగుళ్ల సమస్యలు అధికమయ్యాయి. ప్రస్తుతం పత్తి కాయల్లో నీరు చేరి నల్లగా, ఎర్రగా మారుతున్నాయి.
గతేడాది ఇదే పరిస్థితి..
గతేడాది జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట కాపు దశకు వచ్చిన నాటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల వల్ల 6 క్వింటాళ్లకు పడిపోయింది. వర్షాలకు తడిసిన పత్తికి మార్కెట్‌లో తేమ శాతం పేరుతో క్వింటాల్‌కు రూ.4 వేల కంటే ఎక్కువ ధర పలకలేదు. దీంతో ఆశించిన దిగుబడితో పాటు మద్దతు ధర లేక రైతుకు ఎకరాకు రూ.30 వేల వాటిల్లింది.
పత్తికి కలుపు సమస్య.. కూలీలకు డిమాండ్
జిల్లాలో 80వేల మందికి పైగా రైతులు ఈ వానాకాలం సీజన్‌లో 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఊట్కూర్, మరికల్, ధన్వాడ, కోస్గి, మద్దూ రు, దామరగిద్ద, మక్తల్, నర్వ అత్యధికంగా సాగు చేయగా, మిగితా మండలాల్లో తక్కువగా సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పంటలో కలుపు పెరగడంతో వాటిని తీసివేసేందుకు కూలీలకు డిమాండ్ పెరిగింది. పంటలో వచ్చిన కలుపు తీయడం కోసం రైతులు అష్టకష్టాలుపడుతున్నారు. ఒక్కో కూలీ రోజుకు రూ.500 నుంచి 800 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీనిని అధిగమించేందుకు రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి కలుపుతీత పనులు చేయిస్తున్నారు.
భారీ వర్షాలతో చీడపీడలు, దిగుబడులపై ప్రభావం
తేమశాతం పెరిగి రాలుతున్న పూత
పెట్టుబడిపై ఆశలు ఆవిరి
జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పత్తిసాగు