
ఉపాధి హామీ పథకంలో పనుల జాతర
నారాయణపేట: ఉపాధి హామీ పథకం పనుల జాతర – 2025లో భాగంగా ఈ నెల 22న జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో కొత్త పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈజీఎస్ పథకం కింద ప్రతి ఏటా నిర్వహించే పనుల జాతర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. పనుల జాతర–2024లో భాగంగా నవంబర్ 26న అన్ని జీపీల్లో భూ సంస్కరణ, పశువుల పాకలు, నాడెప్ కంపోస్ట్ పిట్స్, పౌల్ట్రీ షెడ్స్, పొలం బాటలు, చెక్ డ్యాంలు, ఊటకుంటలు, బోర్‌వెల్స్ రీచార్జ్, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు వంటి పనులకు శ్రీకారం చుట్టి.. గత మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పనుల జాతర–2025లో భాగంగా 22న అన్ని జీపీల్లో కొత్త పనులకు భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పనులు నాణ్యతగా సకాలంలో పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు.
గురుకులంలో శుభ్రత పాటించరా?
● మీ చాంబర్‌పై ఉన్న శ్రద్ధ విద్యార్థినుల గదులపై ఎందుకు లేదు..
● గురుకుల ప్రిన్సిపాల్‌పై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం
మరికల్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉంటున్న గదులతో పాటు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆయన అసహనానికి గురయ్యారు. మీ చాంబర్‌పై ఉన్న శ్రద్ధ విద్యార్థినులు ఉంటున్న గదులపై ఎందుకు లేదని ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే గ్రామపంచాయతీ సిబ్బందికి చెప్పినా రావడం లేదని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మరింత ఆగ్రహం వెలిబుచ్చారు. ఇక్కడికి గ్రామపంచాయతీ సిబ్బంది ఎందుకు వస్తారని.. ఇక్కడ పనిచేసే శానిటేషన్ సిబ్బందితో శుభ్రం చేయించుకోవాలన్నారు. పీఎంశ్రీ కింద గురుకులానికి వచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారని అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించగా.. పోతన లేని సమాధానం చెప్పారు. గురుకుల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ కొండన్న, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.
పకడ్బందీగా మాదకద్రవ్యాల నిషేధం అమలు
నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై సీరియస్‌గా ఉందని.. జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు జరగకుండా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. ఇటీవల మక్తల్, ఊట్కూర్‌లో గంజాయిని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అన్ని కళాశాలల్లో డ్రగ్స్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎకై ్సజ్ ఏఈఎస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదుచేసి.. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కృష్ణా మండలంలో గంజాయి సాగుచేసిన రైతుపై కేసు నమోదు చేయించి.. ఆ పొలానికి వచ్చే రైతుభరోసాను నిలిపి వేసినట్లు డీఏఓ జాన్ సుఽ దాకర్ అదనపు కలెక్టర్‌కు తెలియజేశారు. సమావేశంలో ఆర్టీఓ మేఘాగాంధీ, డీఎంహెచ్ ఓ డా.జయచంద్రమోహన్, సీఐలు శివశంకర్, రాంలాల్, ఎకై ్సజ్ ఎస్‌ఐ శిరీష ఉన్నారు.

ఉపాధి హామీ పథకంలో పనుల జాతర