
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నారాయణపేట: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా జిల్లాలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. గణేశ్ నిమజ్జన వేడుకలకు సంబంధించి జిల్లా కేంద్రంతో పాటు మక్తల్, కోస్గి, ఊట్కూర్‌తో పాటు అన్ని మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని.. రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన కంపచెట్లు, ముళ్లపొదలను తొలగించాలన్నారు. నారాయణపేట, మక్తల్, కోస్గి పట్టణాల్లో జరిగే నిమజ్జన వేడుకల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, భక్తులకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉత్సవాల్లో డీజే సౌండ్, ఇతర శబ్ధకాలుష్యం వచ్చే సిస్టమ్‌లను జిల్లాలో నిషేధించినట్లు తెలిపారు. గణేశ్ మండపాల వద్ద, ప్రధాన వీధుల్లో ఫ్లాగ్స్, రిబ్బన్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు పోర్టల్ https://policeportal.tspolice.gov.inలో అనుమతి పొందాలని సూచించారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్‌కు నాణ్యమైన కేబుల్ వినియోగించాలన్నారు. నిమజ్జన వేడుకలకు రెండు రోజుల ముందే మద్యం దుకాణాలను మూసివేయాలని ఎస్పీ సూచించారు. అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీఓ రామచందర్ నాయక్, ఎకై ్సజ్ ఏఈఎస్ నర్సింహారెడ్డి, డీఎంహెచ్‌ఓ డా.జయచంద్రమోహన్, సీఐలు శివశంకర్, రాంలాల్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు సురేఖ రాంబాబు, కార్యదర్శి కన్న శివకుమార్, గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భీంచందర్‌గౌడ్, కార్యదర్శి మిర్చి వెంకటయ్య, భాస్క ర్, రఘువీర్ యాదవ్, బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ వడ్ల శ్రావణ్ ఉన్నారు.
గణేశ్ నిమజ్జన వేడుకలకు
పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ సిక్తా పట్నాయక్