
ఇదేం గడువు?
రైతు బీమా దరఖాస్తుకు 8న సర్క్యూలర్ జారీ.. 13 చివరి తేదీ
నారాయణపేట: రైతు బీమా పథకం 2025–26 కు సంబంధించి దరఖాస్తులకు ఈ నెల 8న రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి సర్క్యూలర్ జారీ చేశారు. 2024– 25 బీమా గడువు ఈ నెల 13కు ముగుస్తోంది. మళ్లీ 2025–26 కు ప్రీమియం చెల్లిస్తే ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. అయితే రైతు బీమాలో చేరేందుకు రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. జూన్ 5 నాటికి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసిన రైతులకు ఈ పథకంలో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 6వ తేదీ నుంచి జారీచేసిన పాస్ పుస్తకాలను ఈ ఏడాదికి పరిగణనలోకి తీసుకోమని వ్యవసాయశాఖ వెల్లడించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,15,244 రైతులు బీమా పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులోంచి 59–60 ఏళ్ల వయసున్న రైతులను తొలగిస్తారు. జిల్లా వ్యాప్తంగా కొత్త పట్టా పాసుపుస్తకాలు 8,915 ఉండగా సోమవారం నాటికి 1,652 మంది రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండిన రైతులను కొత్త లబ్ధిదారులుగా చేర్చనున్నారు.
మిగిలింది రెండు రోజులే..
ప్రభుత్వం ఈ నెల 8న దరఖాస్తుల స్వీకరణకు సర్క్యూలర్ జారీ చేసింది. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు కావడంతో బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు వీలు కలగలేదు. కాగా సోమవారం ఒక రోజు ముగియగా ఈ పథకం పునరుద్ధరణకు రెండు రోజులే గడువు మిగిలినట్లయింది. రైతులే స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనతో రైతులు ముప్పుతిప్పలు పడుతున్నామని వాపోతున్నారు.
ధ్రువీకరణ పత్రాలు..
ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతులే అర్హులు. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో జన్మించిన వారికే అవకాశం. తాజాగా వ్యవసాయ శాఖ చేపడుతున్న కసరత్తులో.. 18 ఏళ్లు నిండి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులను ఈ పథకంలో చేరుస్తున్నారు. 59 ఏళ్లు నిండిన రైతులను జాబితా నుంచి తొలగిస్తారు. వ్యవసాయ అధికారులు (ఏఓలు), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)ల వద్ద రైతు బీమా పత్రాలు తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు కాపీ జతచేసి, దరఖాస్తు పత్రంపై సంతకం చేసి ఏఈఓకు అందజేయాలి. అదేక్రమంలో నామినీ ఆధార్ కార్డు, వివరాలను ఏఈఓలకు ఇవ్వాలి.
●
శని, ఆదివారాలు సెలవులే
మూడు రోజుల గడువుతో తిప్పలు
జిల్లాలో కొత్త పట్టా పాసుపుస్తకాలు 8,915
వచ్చిన దరఖాస్తులు 1,652