బనగానపల్లె: పవిత్రశైవక్షేత్రమైన యాగంటి దేవస్థానంలో ఈ నెల 10 నుంచి కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌలీశ్వరరెడ్డి తెలిపారు. డిసెంబరు 8వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు కొనసాగుతాయన్నారు. 16వ తేదీన మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాబిషేకాలు, కుంకుమార్చనలు సహస్త్రనామావలి, మహానివేదిత, ఉచిత ప్రసాద వితరణ, స్వామివారి పల్లకీ సేవ, 24న కార్తీక పౌర్ణమి రోజు లక్షదీపోత్సవ కార్యక్రమం, సాయంత్రం 8 గంటలకు పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బండి ఆత్మకూరు, శిరివెళ్ల సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 28 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 20 స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 377 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 152 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, ఒక స్థానంలో అభ్యర్థులు లేరని, మిగిలిన 224 స్థానాలకు పోటీ జరిగిందన్నారు. ఈ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా కొనసాగిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు వివరణ అందిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తగ్గిన మొక్కజొన్న దిగుబడులు
ఉయ్యాలవాడ: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న దిగుబడులు గణనీయంగా తగ్గాయి. మండలంలో ఇంజేడు, ఉయ్యాలవాడ, పెద్దయమ్మనూరు, మాయలూరు, అల్లూరు, తదితర గ్రామాల పరిధిలో 328 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత, నూర్పిడి పనులు జరుగుతున్నాయి. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు వర్షాలు లేక పంట దిగబడులు తగ్గాయ ని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయని తెలిపారు. పంట సాగుకు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సేద్యాలు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలుపెట్టుబడులు వచ్చాయన్నారు. దిగుబడులు ఇళ్లవద్ద నిల్వ చేసుకునేందుకు కూడా వసతులు లేకపోవడంతో రహదారులపై ఆరబెట్టుకున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న మార్కెట్లో క్వింటా ధర రూ. 2,500 పలుకుతోంది. కౌలు రైతులు ఎకరాకు ముందస్తు రూ. 25 వేలు కౌలు చెల్లించి పంట సాగు చేశారు. తీరా దిగుబడులు ఎకరాకు 15 క్వింటాళ్లలోపే వస్తుండటంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర క్వింటా రూ. 4 వేలు కల్పించాలని కోరుతున్నారు.
దోమతెరలను వినియోగించండి
డోన్ రూరల్(ప్యాపిలి): దోమల ద్వారా వ్యాపించే ప్రమాదకర వ్యాధుల నుంచి ఆత్మరక్షణ పొందడానికి ప్రతి ఒక్కరూ రాత్రి వేళల్లో తప్పనిసరిగా దోమతెరలను వాడాలని జిల్లా మలేరియా అధికా రి చంద్రశేఖర్‌రావు, డోన్ మలేరియా సబ్ యూని ట్ అధికారి రాజశేఖర్‌రెడ్డి, చిన్న మల్కాపురం వైద్యాధికారి డాక్టర్ చెన్న కేశవులు అన్నారు. శనివారం పట్టణంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్, అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు దోమల నివారణ చర్యల్లో భాగంగా దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నీటి తొట్లు, డ్రమ్ములు, ఇతర పాత్రలను ఎప్పటికప్పు డు శుభ్రపరిచి గట్టిగా మూతలు పెట్టాలన్నారు. జ్వరం, చలి లేదా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది వేణుగోపాల్ రెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.


