జూపాడుబంగ్లా: నేషనల్‌హైవే 340సీ రోడ్డు నిర్మాణంలో భాగంగా మండ్లెం నుంచి మండల కేంద్రమైన జూపాడుబంగ్లా వరకు బీటీరోడ్డు నాసిరకంగా వేస్తుండటంతో ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండ్లెం నుంచి జూపాడుబంగ్లా వరకు ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణంతో పాటు బీటీరోడ్డును నిర్మించాల్సి ఉంది. డ్రైనేజీ కాల్వను ఇష్టానుసారంగా తాగునీటి పైపులైన్‌పై నిర్మించటంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ మేరకు డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలించిన హైవే అధికారులు కాంట్రాక్టర్‌ను తీవ్రంగా మందలించటంతో పాటు డ్రైనేజీ కాల్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పేర్కొంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో పాటు డ్రైనేజీ కాల్వ నిర్మాణం పనులను నిలిపివేయించారు. అందులో భాగంగా ప్రస్తుతం మండ్లెం, తంగడంచ, జూపాడుబంగా గ్రామాల్లో ఐదు కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నాణ్యతకు తిలోదకాలిచ్చి రోడ్డును నిర్మిస్తుండటంతో గ్రామస్తులు, ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు మండిపడుతున్నారు. పదికాలాల పాటు మన్నికగా ఉండాల్సిన రోడ్డును నాసిరకంగా నిర్మిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.


