జూపాడుబంగ్లా: మండలంలోని తర్తూరు గ్రామంలో బుధవారం సాయంత్రం మాజీ సర్పంచ్ శివరామకృష్ణారెడ్డి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అబ్బిరెడ్డిగారి జయశ్రీ, భర్త నరేష్‌రెడ్డి, మామ రాధాకృష్ణారెడ్డి పోలీసుస్టేషన్ వద్దకు చేరుకోగా ఎస్‌ఐ మల్లికార్జున మొదట శివరామకృష్ణారెడ్డిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు. తర్వాత మాట మార్చి అభ్యర్థి భర్త నరేష్‌రెడ్డి, మామ రాధాకృష్ణారెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొనటంతో వారు భయాందోళనకు గురయ్యారు. పోలీసు అదుపులో ఉన్న వ్యక్తిని చూడటానికి వచ్చిన తమపై కేసులు పెట్టడం తగదని వేడుకున్నా ఎస్‌ఐ వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు గ్రామంలో యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నా పట్టించుకోని పోలీసులు కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులను డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో అరెస్టు చేసి భయాందోళనకు గురిచేయడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ మల్లికార్జునను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు.


