సీ్త్రశక్తి పథకంతో ఆర్టీసీలో విపరీతమైన రద్దీ
ప్రతిబస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులు
కండక్టర్లు, డ్రైవర్లు, ప్రయాణికులకు నరకయాతన
కొత్త బస్సులు కేటాయించని ప్రభుత్వం
కోవెలకుంట్ల: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం. శిక్షణ పొందిన డ్రైవర్లు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తారన్నది ఆర్టీసీ నినాదం. అలాంటిది ప్రస్తుతం ఆర్టీసీ కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. గతేడాది ఆగస్టు 15 నుంచి సీ్త్రశక్తి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం అమలుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు, సంస్థలో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లాలో కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్, నంద్యా ల, ఆత్మకూరు, నందికొట్కూరు పట్టణాల్లో ఆర్టీసీ డిపోలున్నాయి. ఏడు డిపోల పరిధిలో 312 ఆర్టీసీ, 126 అద్దె బస్సుల ద్వారా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇందిరా ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. దీంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్,ఆర్టీనరీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 51 మంది, ఆర్టీనరీ, పల్లెవెలుగు బస్సుల్లో 54 మంది సీటింగ్ కెపాసిటీ కాగా ప్రతి బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
అస్తవ్యస్తంగా మారిన ప్రయాణం:
జిల్లాలో 438 ఆర్టీసీ బస్సులుండగా 1,229 మంది డ్రైవర్లు, కండక్లర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80–100 మంది దాకా రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం. రద్దీ దృష్ట్యా ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంది. అయితే పథకం ప్రారంభమై 14 నెలలు గడిచినా అలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరం.
రెన్యూవల్‌కు విముఖత
ఆయా డిపోల పరిధిలో 126 అద్దె బస్సులు నడుస్తున్నాయి. 5.7 కి.మీలకు ఒక లీటర్ చొప్పున 420 కి.మీ.లకు డీజిల్ సరఫరా చేస్తారు. కి.మీకు రూ.8 చొప్పున బాడుగ చెల్లిస్తారు. డ్రైవర్, క్లీనర్, ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు బస్సు యజమానులే పెట్టుకోవాలి. బస్సుల్లో రద్దీ పెరిగాక నిర్వహణ యాజమానులకు భారంగా మారింది. ట్రిప్పుకు 80 –100 మంది ప్రయాణికులు ఉంటుండటంతో మైలేజీ రాక అదనపు భారం పడుతోంది. లీటరు డీజిల్ 4.5 కి.మీలకు మించి రాకపోవడం, టైర్లు త్వరగా అరిగిపోవడం, కట్టలు విరిగిపోవడం, మె యింటెనెన్స్ రూపంలో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఆయా డిపోల పరిధిలో 18 అద్దెబస్సులు రెన్యూవల్ చేసుకోకపోవడం గమనార్హం.
కోవెలకుంట్ల బస్టాండ్‌లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు బస్సులో సీటు పట్టుకునేందుకు ఎగబడుతున్న ప్రయాణికులు
నిత్యం గొడవలే!
ప్రయాణికుల సంఖ్య పెరగడంతో నిత్యం ఏదో ఒకచోట గొడవలు చోటు చేసుకుంటున్నాయి. స్టేజీల వద్ద బస్సులు ఆపడం లేదని, తాము పట్టుకున్న సీట్లలో ఇతరులు కూర్చున్నారని, ఫుట్‌బోర్డ్‌పై నిలబడి, వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, బస్సులో వెనక్కు వెళ్లడం లేదని, తదితర కారణాలతో ప్రయాణికులు, డ్రైవర్లు, కండకర్ల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మహిళలు, పురుష ప్రయాణికుల మధ్య గొడవలు తప్పడం లేదు. సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణాలు చేస్తుండటంతో ఆయా డిపోల్లో 22 బస్సులను స్క్రాబ్ పేరుతో డిపోకే పరిమితం చేశారు.


